– తంగడపల్లి రోడ్డులో ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సు
– నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ సీఐ విజయ్ మోహన్
చౌటుప్పల్, (తొలివెలుగు): వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ విజయ్ మోహన్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు ఆదివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డులో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మోహన్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని గుర్తు చేశారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, వాహనాలకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు, ఏఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు పరశురాములు, శంకర్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
