తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ దిశానిర్దేశకుడు
• తంగడపల్లిలో ఘనంగా 92వ జయంతి వేడుకలు
• విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు
• ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: నాయకులు

తొలివెలుగు, చౌటుప్పల్:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అందించిన సైద్ధాంతిక మార్గదర్శకత్వం చిరస్మరణీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో గురువారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని జయశంకర్ సార్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుల్లో జయశంకర్ సార్ ఒకరని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యపరిచిన ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనకు ఆయన అందించిన ఆలోచనలు, సిద్ధాంతాలు ఉద్యమానికి దిశానిర్దేశం చేశాయని గుర్తు చేశారు.
జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని, సమాజాభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోయ్యడ శేఖర్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, గడ్డం ఇందిరా రాజరత్నం, మాజీ సర్పంచ్ ముటుకుల్లోజు దయాకర్ చారి, నాయకులు బొప్పిడి రఘునందన్ రెడ్డి, రాగీరు సత్యనారాయణ, నిమ్మల అచ్చయ్య, బొడ్డు ముత్యం గౌడ్, బొంగు స్వామి, జిట్ట కృష్ణ, ఎండి అస్లాం తదితరులు పాల్గొన్నారు.
