Telugu Updates

గ్రామసభను అడ్డుకోవడం సిగ్గుచేటు

• గ్రామసభను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సర్పంచ్‌: ఉప సర్పంచ్ ధ్వజం

• రూ.53 లక్షల అభివృద్ధి పనుల రికార్డులు ఉన్నా కావాలనే గందరగోళం సృష్టించారని ఆరోపణ

• అభివృద్ధిని పక్కనబెట్టి రాజకీయ ఆరోపణలు చేయడం దురదృష్టకరం

• ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు పునరావృతమైతే సహించబోమని ఘాటు హెచ్చరిక

తొలివెలుగు, చౌటుప్పల్:

ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన గ్రామసభను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, గ్రామ సమస్యలపై చర్చ జరగకుండా అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని దండు మల్కాపూర్ ఉప సర్పంచ్ మీసాల నర్సింహా విమర్శించారు. గ్రామసభలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ పంచాయతీ పనులపై కార్యదర్శి వివరణ ఇస్తుండగా ఉద్దేశపూర్వకంగా సభను భంగపరిచే ప్రయత్నం చేశారని సర్పంచ్‌పై ఆరోపించారు.

 

Post Midle

ప్రత్యేక అధికారి పాలనలో గ్రామంలో రూ.53 లక్షల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని, వాటికి సంబంధించిన ఎం.బీ. రికార్డులు, ఫోటోలు, కంపెనీలు సమర్పించిన వివరాలు ప్రజల ముందుంచేందుకు కార్యదర్శి సిద్ధంగా ఉన్నప్పటికీ పూర్తి వివరణ ఇవ్వకుండా మైక్ లాక్కొని సభను అడ్డుకున్నారని తెలిపారు. అనంతరం మీడియాను పిలిపించి ఎజెండాలో లేని అంశాలపై ప్రచారం చేయడం వెనుక ముందస్తు ప్రణాళిక ఉందని ఆరోపించారు.

 

ప్రత్యేక పాలనలో సి.ఎస్.ఆర్. నిధులతో రెండు బావులు, రెండు వాటర్ ప్లాంట్లు, రెండు బోర్లు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించిన అన్ని అధికారిక రికార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి పి. రమాదేవిపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. కార్యదర్శి పనితీరుపై చర్యలు తీసుకోవాల్సింది సంబంధిత శాఖేనని, సస్పెన్షన్ వంటి అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు.

 

గ్రామ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన సర్పంచ్ వ్యక్తిగత విమర్శలు, వివాదాలతో కాలక్షేపం చేస్తున్నారని మీసాల నర్సింహా ఆరోపించారు. కోతుల సమస్య పరిష్కారం, బస్సుల ఏర్పాటు వంటి హామీలను నెరవేర్చడంలో చొరవ చూపాలని సూచించారు. గ్రామసభలో ప్రజల సమస్యలు చర్చించాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వడం గ్రామాభివృద్ధికి ఆటంకమని అన్నారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై గ్రామసభలో అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ గ్రామాలకు నిధులు, అభివృద్ధి పనులు తీసుకొస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే సహించబోమని హెచ్చరించారు.

 

ఈ సమావేశంలో వార్డు సభ్యులు సుక్క రవీందర్, పక్కిర్ వంశీధర్ రెడ్డి, ఈడుదల ఇంద్రసేన యాదవ్, షేక్ అంజుమ్ అంజద్, ఉప్పరి అనిల్ కుమార్, అత్తాపురం సంతోష్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post bottom
Post bottom