మల్లన్న గుడిలో దొంగల బీభత్సం!
– హుండీ పగలగొట్టి రూ.50 వేల నగదు అపహరణ
– గతంలోనూ దొంగతనానికి యత్నం..
– నిఘా కరవైందంటున్న భక్తులు.. రంగంలోకి దిగిన పోలీసులు

తొలివెలుగు, ఇబ్రహీంపట్నం :
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ హుండీని పగలగొట్టి సుమారు రూ.50 వేల వరకు నగదును అపహరించిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ బైపాస్ రోడ్డు పక్కన ఉన్న మల్లన్న దేవాలయానికి శుక్రవారం ఉదయం భక్తులు, స్థానికులు దర్శనం కోసం వచ్చారు. ఈ క్రమంలో ఆలయ ఆవరణలోని హుండీ పగిలిపోయి ఉండడాన్ని గమనించి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం హుండీలో ఉన్న రూ.50 వేల మేర నగదును దుండగులు గుంజినట్లు తెలుస్తోంది.
గతంలోనూ చోరీ యత్నం..
ఈ ఆలయంలో గతంలోనూ ఒకసారి చోరీ ప్రయత్నం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లోనే హెచ్చరించినా ఆలయ నిర్వాహకులు, అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ ఘటన జరిగిందని భక్తులు మండిపడుతున్నారు. దేవాలయాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ నిఘా పెంచాలని, ఆలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
