Telugu Updates

మంగోరిగూడెంలో పోలీసుల భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

• 250 ఇళ్లలో తనిఖీలు.. గుడుంబా తయారీ సామగ్రి ధ్వంసం

• ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన

తొలివెలుగు, చిన్నగూడూరు:

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, తొర్రూర్ డీఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున మరిపెడ సర్కిల్ పోలీసులు, క్యూఆర్టీ (క్విక్ రెస్పాన్స్ టీమ్) బలగాలతో కలిసి చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని కూడా చేపట్టి గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

Post Midle

ఆపరేషన్‌లో భాగంగా గ్రామంలోని సుమారు 250 ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నల్లబెల్లం, గుడుంబా, పటికతో పాటు గుడుంబా తయారీకి వినియోగించే నల్లబెల్లం ఊట (వాష్)ను అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

అనంతరం గ్రామస్తులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఎస్‌ఐ కుశకుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, అతివేగం వల్ల జరిగే ప్రమాదాలు, గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాల నివారణ, మైనర్లకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ఉన్న నిషేధం తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు గ్రామస్తులకు తెలిపారు.

అలాగే గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో 8 మంది క్యూఆర్టీ సిబ్బందితో పాటు మరిపెడ సర్కిల్‌కు చెందిన మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం, అక్రమ కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.

Post bottom
Post bottom