Telugu Updates

వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం

• విద్యార్థులు, రైతులు అస్వస్థత.. పెరపల్లిలో భయాందోళనలు

• శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఆసుపత్రులకు తరలింపు

• కాలుష్యంపై మళ్లీ తెరపైకి వచ్చిన ఫార్మా కంపెనీల నిర్లక్ష్యం

• ఫార్మా కంపెనీల భద్రతా ప్రమాణాలపై స్థానికుల ఆగ్రహం

తొలివెలుగు, చిట్యాల:

Post Midle

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెరపల్లి గ్రామ పరిధిలోని వియాస్ ఫార్మా కంపెనీలో మంగళవారం ప్రమాదవశాత్తు రసాయన వాయువు లీక్ కావడంతో పలువురు విద్యార్థులు, రైతులు అస్వస్థతకు గురయ్యారు. పెరపల్లి నుంచి వెలిమినేడు గ్రామానికి వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్న పాఠశాల విద్యార్థులు, పొలాల్లో పనిచేస్తున్న రైతులు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కెమికల్ వాయువు గాల్లో వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా ఘాటైన దుర్వాసన అలుముకుంది. దీంతో పలువురికి కళ్ల మంట, వాంతులు, తలతిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

 

Post bottom
Post bottom