• అతివేగమే ప్రమాదానికి కారణం.. ఒకరి పరిస్థితి విషమం
• మంచాల మండలం ఆగపల్లి శివారులో దుర్ఘటన
• క్షతగాత్రులు ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలింపు

తొలివెలుగు, మంచాల : రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున సాగర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగపల్లి గ్రామ శివారులో రెండు కార్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
నుజ్జునుజ్జైన వాహనాలు:
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జున సాగర్ హైవేపై వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఆగపల్లి వద్దకు రాగానే నియంత్రణ కోల్పోయి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు రెండు కార్ల ముందుభాగాలు పూర్తిగా నలిగిపోయి నుజ్జునుజ్జయ్యాయి. వాహనాలు వేగంగా ఢీకొనడంతో భారీ శబ్దం వచ్చింది. ప్రయాణికులు కార్ల క్యాబిన్లలో చిక్కుకుపోయి నరకయాతనను అనుభవించారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కార్ల తలుపులను పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
క్షతగాత్రులకు చికిత్స:
ప్రమాద స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను తక్షణమే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి తలకు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించే యోచనలో ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. కాగా, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న మంచాల పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
