Telugu Updates

దళారుల దగా.. భగ్గుమన్న రైతన్న!

దళారుల దగా.. భగ్గుమన్న రైతన్న!

గొట్టిపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాల పర్వం

• క్వింటాకు 5 కిలోల కోత.. కన్నీరు పెడుతున్న రైతాంగం

• ఆగ్రహంతో ధాన్యం బస్తాలకు నిప్పంటించిన అన్నదాతలు

• పారదర్శకత ఏదీ? విచారణకు రైతుల డిమాండ్

తొలివెలుగు, సూర్యాపేట : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామని వచ్చిన అన్నదాతలకు కొనుగోలు కేంద్రాల్లో నిరాశే ఎదురవుతోంది. ఆరుబయట ఎండకు ఎండుతూ, వానకు నానుతూ కాపాడుకున్న ధాన్యానికి తూకం పేరిట కటింగ్ వడ్డిస్తుండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సూర్యాపేట జిల్లా గొట్టిపర్తి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో చోటుచేసుకున్న ఘటనే దీనికి సజీవ సాక్ష్యం. నిబంధనలకు విరుద్ధంగా క్వింటాకు ఐదు కిలోల చొప్పున కోత విధిస్తుండటంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న రైతులు ధాన్యం బస్తాలకు నిప్పంటించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

Post Midle

తూకంలో మాయాజాలం..

రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం తూకం వేసి రశీదులు ఇవ్వాల్సి ఉండగా, గొట్టిపర్తి ఐకేపీ కేంద్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. స్థానికంగా పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తుల కనుసన్నల్లో ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడికి చేరిన తర్వాత తాలు, తప్ప, తేమ పేర్లు చెప్పి ప్రతి క్వింటాకు కచ్చితంగా 5 కిలోల మేర కటింగ్ విధిస్తున్నారు. దీంతో పది క్వింటాల ధాన్యం అమ్మిన రైతు 50 కిలోల మేర నష్టపోవాల్సి వస్తోంది. ఇది నేరుగా రైతుల కడుపు కొట్టడమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన రాబడి..

ఒకవైపు ఎరువులు, విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి పంట పండిస్తే.. తీరా చేతికొచ్చిన తర్వాత దళారుల చేతిలో మోసపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై ఈ దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

భగ్గుమన్న రైతన్న..

అన్యాయంపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో సహనం కోల్పోయిన రైతులు ఆందోళన బాట పట్టారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని దోపిడీదారులకు అప్పగించే బదులు కాల్చి బూడిద చేయడమే నయమంటూ.. కొనుగోలు కేంద్రం వద్దే కొన్ని బస్తాలకు నిప్పంటించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. ఈ అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Post bottom
Post bottom