Telugu Updates

బిల్లులు చెల్లించలేదని పాఠశాల గేటుకు తాళం!

– రూ. 23 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయన్న మాజీ సర్పంచ్

– పడిగాపులు కాసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

– జిల్లా విద్యాధికారి చొరవతో తాళం తొలగింపు

Post Midle

 తొలివెలుగు, వలిగొండ : ‘మన ఊరు – మన బడి’ పథకం కింద చేపట్టిన పాఠశాల నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ సంగెం గ్రామ మాజీ సర్పంచ్ సోమవారం పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసిన ఘటన వలిగొండ మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలిగొండ మండలం సంగెం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.28 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులను అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కీసర్ల రామ్ రెడ్డి చేపట్టారు.

పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ.28 లక్షల బిల్లులను రికార్డు చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు. అయితే ఇప్పటివరకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే మంజూరయ్యాయని, మిగిలిన రూ.23 లక్షలు ఇంకా అందలేదని పేర్కొంటూ నిరసనగా పాఠశాల గేటుకు తాళం వేశారు. ఇప్పటికే తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి నెలకొందని మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బయటే నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాధికారికి తెలియజేశారు. జిల్లా విద్యాధికారి వెంటనే మాజీ సర్పంచ్ రామ్ రెడ్డితో మాట్లాడి, త్వరలోనే బిల్లులు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు. ఆయన చొరవతో స్పందించిన మాజీ సర్పంచ్ పాఠశాల గేటుకు వేసిన తాళాన్ని తొలగించారు. దీంతో పాఠశాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Post bottom
Post bottom