Telugu Updates

చౌటుప్పల్‌లో లౌకిక శక్తులతో కలిసి సీపీఎం పోటీ

– ప్రజా సమస్యలపై నిరంతర పోరాటమే లక్ష్యం : ఎండి పాషా

Post Midle

చౌటుప్పల్, తొలివెలుగు: రానున్న చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసొచ్చే లౌకిక శక్తులతో కలిసి సీపీఎం పార్టీ పోటీ చేస్తుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీపీఎం పార్టీ పట్టణ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ కమిటీ కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చౌటుప్పల్ మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ తరఫున సర్పంచ్, ఎంపీటీసీలుగా గెలిచి అభివృద్ధి చేసిన చరిత్ర తమకుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులు గెలిస్తే మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాటం చేస్తారని, వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పాలకవర్గంపై ఒత్తిడి తీసుకొస్తారని చెప్పారు. సీపీఎం మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ మాట్లాడుతూ.. అవినీతి లేకుండా సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో కలిసి వచ్చే లౌకిక పార్టీలతో కలిసి పోటీ చేస్తామని, మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గతంలో చౌటుప్పల్‌లో వరదల సమయంలో చెరువు నీటితో పట్టణంలోని కొంత భాగం మునిగినప్పుడు ప్రజలకు అండగా నిలబడి ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా కాపాడిన చరిత్ర తమ ప్రజాప్రతినిధులకు ఉందని గుర్తు చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారి రామేశ్వరి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గతంలో సీపీఎం సర్పంచ్‌గా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఘనతను, ఎన్నికైన కౌన్సిలర్లు నీతి, నిజాయితీతో పాలన సాగించారన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ కార్యదర్శివర్గ సభ్యులు దండ అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు బండారు నరసింహ, సీపీఎం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్, సీఐటీయూ నాయకులు బత్తుల దాసు, రైతు సంఘం నాయకులు ఆకుల ధర్మయ్య, ఉష్కాగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post bottom
Post bottom