పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి
– మండల ఇన్‌చార్జి విద్యాధికారి సుంకోజు భాస్కర్

వలిగొండ, తొలివెలుగు: పాఠశాల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని మండల ఇన్‌చార్జి విద్యాధికారి సుంకోజు భాస్కర్ పిలుపునిచ్చారు. పాఠశాల అభివృద్ధిలో సమాజ సేవకుల భాగస్వామ్యం అనే కార్యక్రమంలో భాగంగా వలిగొండ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వలిగొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆలకుంట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు కౌడే కృష్ణ పాఠశాల విద్యార్థులకు టైలు, బెల్టులు పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మంచి ఉద్దేశంతో ఈ సహకారం అందించారని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి మాట్లాడుతూ, పాఠశాల ఇప్పటికే చక్కగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న మండల ఇన్‌చార్జి విద్యాధికారి సుంకోజు భాస్కర్ మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులోనూ మద్దతు కొనసాగించాలని కోరారు.
దాత కౌడే కృష్ణకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చేయూతనిచ్చే మంచి మనసుకు అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మాట్లాడుతూ, గ్రామ పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని, పాలకవర్గం నుంచి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

అనంతరం సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించగా, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఏబీసీ చైర్మన్ గోవిందమ్మ, ఉపసర్పంచ్ మల్గ మాధవి, వార్డు సభ్యులు దంతూరి అరుణ్, బత్తిని నాగేష్, గొలుసుల శాంతి, మైసోళ్ళ మాధవి, పబ్బు అరుంధతి, పల్లెర్ల లక్ష్మయ్యతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు మునగపాటి వరమ్మ, మామిడి కవిత, మణిమాల, ప్రశాంతి, ఉషా, కనకమ్మ తదితరులు పాల్గొన్నారు.
