– అదనపు కలెక్టర్‌కు మాల మహానాడు వినతి

తొలివెలుగు, వలిగొండ : ఈ నెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల యాదగిరి, వలిగొండ మండల అధ్యక్షులు కూచిమల్ల నాగేష్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) భాస్కరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటం ఉండేలా స్పష్టమైన సూచనలు జారీ చేయాలని అడిషనల్ కలెక్టర్‌ను కోరారు. రాజ్యాంగ విలువలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఇది కీలకమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాశమల్ల శేఖర్, సహాయ కార్యదర్శి కట్ట సురేష్, సంస్కృతిక కార్యదర్శి కూచిమల్ల కుమార్, వెలువర్తి గ్రామ అధ్యక్షులు కూచిమల్ల నాగేంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు వలమల్ల రత్నయ్య, జక్క స్వామి, మద్దెల వెంకటేశం, బెల్లపు కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.
