> తరచూ ద్రవపదార్థాలు తీసుకోవాలి.. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లొద్దు
> చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి
> తంగడపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ చింతకింది కాటం రాజు సూచన

తొలివెలుగు, చౌటుప్పల్ : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చింతకింది కాటం రాజు సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని సూచించారు. అలాగే పుచ్చకాయ, ఖర్బూజ, తాటి ముంజలు వంటి శీతల గుణాలు కలిగిన ఆహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు, టోపీ లేదా తలకు వస్త్రం కప్పుకోవాలని, లేత రంగుల పత్తి దుస్తులు ధరించడం మంచిదని చెప్పారు. నలుపు రంగు లేదా గట్టిగా ఉండే దుస్తులను ధరించకుండా ఉండాలని సూచించారు.
ఎండలో ఎక్కువసేపు పనిచేయడం, మద్యం సేవించడం, అధికంగా కాఫీ, టీ తాగడం, నూనె పదార్థాలు మరియు వేయించిన ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులను వాహనాల్లో ఒంటరిగా వదిలివేయరాదని, ఎండలో ఎక్కువసేపు ఆడుకోవడానికి అనుమతించవద్దని హెచ్చరించారు.
వడదెబ్బ లక్షణాలుగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అలసట, చెమట ఆగిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి, శరీరంపై చల్లటి నీరు చల్లడం, ఓఆర్‌ఎస్ ద్రావణం లేదా నీరు తాగించడం చేయాలని సూచించారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రం లేదా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించాలని పేర్కొన్నారు.
మండల పరిధిలోని అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ చింతకింది కాటం రాజు విజ్ఞప్తి చేశారు.
