Telugu Updates

వారసంతలో దాహార్తి తీర్చుతున్న పీసీఆర్ ఫౌండేషన్

• ఏడో వారానికి చేరిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం

తొలివెలుగు, జన్నారం: మండుతున్న ఎండల్లో వారసంతకు వచ్చే ప్రజలకు చల్లని ఉపశమనం కలిగించేందుకు జన్నారం మండల కేంద్రంలో పీసీఆర్ (పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రశంసలు అందుకుంటోంది. ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం నేటితో విజయవంతంగా ఏడో వారానికి చేరుకుంది.

జన్నారం వారసంతకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు, వ్యాపారులు తరలివస్తుంటారు. ఎండ తీవ్రత కారణంగా సంతకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారి దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో పీసీఆర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి వారం వందలాది మందికి చల్లని మజ్జిగను ఉచితంగా అందిస్తూ మానవత్వాన్ని చాటుతోంది.

Post Midle

ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు వారసంతలో మజ్జిగ పంపిణీ చేపట్టామని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. వేసవికాలం పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని వెల్లడించారు.

వారసంతకు వచ్చిన ప్రజలు కూడా ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ, ఎండల్లో చల్లని మజ్జిగ అందించడం ఎంతో ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు. సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ సభ్యులను పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో నోముల రాజకుమార్, యూసుఫ్, దేవయ్యతో పాటు పీసీఆర్ ఫౌండేషన్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

Post bottom
Post bottom