Telugu Updates

కిడ్నీ వైఫల్యానికి అధునాతన వైద్యంతో చెక్

– సకాలంలో ‘రీనల్ బయాప్సీ’తో మెరుగైన ఫలితాలు

– వివరాలు వెల్లడించిన మలక్‌పేట యశోద ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చేతన్

తొలివెలుగు, చౌటుప్పల్: మారుతున్న జీవనశైలి కారణంగా వేగంగా పెరుగుతున్న కిడ్నీ వైఫల్య సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో చెక్ పెట్టవచ్చని మలక్పేట్ యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చేతన్ వీరమనేని స్పష్టం చేశారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 9 హెచ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిడ్నీ వైఫల్యాన్ని తొలిదశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించకపోతే కిడ్నీలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తద్వారా రోగి జీవితకాలం డయాలసిస్ పై ఆధారపడటం లేదా కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) చేయాల్సిన అత్యవసర పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. కిడ్నీ వ్యాధులతో బాధపడేవారిలో ప్రధానంగా శరీరం మొత్తం వాపు రావడం, మూత్రం సక్రమంగా రాకపోవడం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు ఉంటాయని, వీటిని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

Post Midle

వ్యాధి నిర్ధారణలో ‘రీనల్ బయాప్సీ’ కీలకం..

వ్యాధికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ‘రీనల్ బయాప్సీ’ వంటి వైద్య పరీక్షలు అత్యంత కీలకమని డాక్టర్ చేతన్ పేర్కొన్నారు. రియల్ టైమ్ అల్ట్రా సౌండ్ గైడెడ్ రీనల్ బయాప్సీ వంటి ఆధునిక సదుపాయాలు మలక్‌పేట యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇటీవల నల్గొండ జిల్లా గుర్రంపోడు గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ తీవ్ర అస్వస్థతతో తమ ఆస్పత్రికి వచ్చారని, 15 రోజులుగా ఆమె శరీరం మొత్తం వాచిపోయి, మూత్రం తగ్గిన సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. వైద్య పరీక్షల్లో ఆమెకు కిడ్నీ పనితీరు మందగించిందని, మూత్రం ద్వారా అధికంగా ప్రోటీన్ బయటకు పోతున్నట్లు (ప్రోటీన్ లాస్) నిర్ధారించామని వివరించారు.

వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం, అల్ట్రా సౌండ్ మార్గదర్శకత్వంలో రీనల్ బయాప్సీ, హిస్టోపాథాలజీ, ఇమ్యునో ఫ్లోరోసిస్ వంటి కచ్చితమైన పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాపిడ్ రీనల్ ఫెయిల్యూర్ అత్యంత ప్రమాదకరమని, అయితే సకాలంలో వ్యాధి కారణాన్ని గుర్తించి, మెరుగైన చికిత్స అందించడంతో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిందన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నారని, పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ చేతన్ వెల్లడించారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధి శ్రీనివాస్ చిదుర మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికత, నిపుణులైన వైద్య బృందం, రోగి-కేంద్రీకృత విధానాలతో ఎలాంటి క్లిష్టమైన కిడ్నీ వ్యాధులకైనా మలక్పేట్ యశోద ఆసుపత్రిలో సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.

Post bottom
Post bottom