మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన నోష్ ఫార్మా కంపెనీ
– మే డే రోజున కార్మికుల రక్తతర్పణం
– 9మంది కార్మికులకు తీవ్ర గాయాలు
– ఒకరి పరిస్థితి విషమం
– చికిత్స పొందుతూ టెక్నీషియన్ బొడ్డు బాలకృష్ణ మృతి
– ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
మృతుని ఫైల్ ఫోటో బొడ్డు బాలకృష్ణ
తొలివెలుగు, చిట్యాల : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ శివారులో ఉన్న నోష్ ఫార్మా కంపెనీలో మరోసారి భారీ పేలుడు చోటుచేసుకుని కలకలం రేపింది. వరుస ప్రమాదాలు కార్మికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని స్థానికులు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మే డే రోజునే ఈ విషాదం చోటుచేసుకోవడం మరింత బాధాకరంగా మారింది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు దినంగా ఉండాల్సిన రోజున కార్మికులను పనిలో నిమగ్నం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో కంపెనీలోని రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో టెక్నీషియన్ బొడ్డు బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉండగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఇదే కంపెనీలో గత నెల ఏప్రిల్ 9న కూడా పేలుడు ప్రమాదం చోటుచేసుకుని ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. కేవలం 20 రోజుల్లోనే మరోసారి ప్రమాదం జరగడం భద్రతా లోపాలకు నిదర్శనంగా మారింది.

వరుస ఘటనలు జరుగుతున్నా యాజమాన్యం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సెలవు దినాల్లో కూడా ఒత్తిడి తెచ్చి పనులు చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రమాదాల పునరావృతం నేపథ్యంలో తనిఖీలు నిర్వహించాల్సిన యంత్రాంగం పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనపై ఆగ్రహంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు. కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి, మృతుడి కుటుంబానికి భారీ నష్టపరిహారం చెల్లించాలని కోరారు. జిల్లాలోని అన్ని ఫార్మా కంపెనీలపై తక్షణమే థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
