Telugu Updates

వలిగొండలో ఆహార భద్రతా అధికారులపై దాడి: విధులకు ఆటంకం కలిగించిన షాపు యజమాని

• తనిఖీలను అడ్డుకున్న యజమాని కుటుంబం.

• గడువు ముగిసిన నిల్వలు, ప్రమాదకర రసాయనాల గుర్తింపు.

• అధికారులను అసభ్య పదజాలంతో దూషించిన వైనం.

• విధులకు ఆటంకం కలిగించిన షాపు యజమాని కుటుంబంపై కేసు నమోదు 

Post Midle

వలిగొండ, తొలి వెలుగు : మండల కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల సమయంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటన చోటుచేసుకుంది. జిల్లా ఇన్‌చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కిరాణా షాపులు, హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మాతాజీ కిరాణం షాపు తనిఖీ అనంతరం మణికంఠ కిరాణాల షాపులో ఆహార పదార్థాల తనిఖీ కోసం వెళ్లగా షాపు యజమాని నాగభూషణం, ఆయన భార్య లలిత, కుమారుడు మణికంఠలు దుర్భాషలాడుతూ అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ తనిఖీలను అడ్డుకున్నట్లు తెలిపారు.

ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన అనంతరం వారి సూచనల మేరకు స్థానిక పోలీసుల సహకారంతో తనిఖీలు కొనసాగించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో గడువు ముగిసిన ప్యాకెట్ ఆహార పదార్థాలు, అధిక పరిమాణంలో రంగులు, రసాయనాలు ఉపయోగించిన ఆహార పదార్థాలు గుర్తించి శాంపిళ్లు సేకరించినట్లు తెలిపారు.

తనిఖీల సమయంలో అధికారుల మొబైల్ ఫోన్‌ను లాక్కుని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం, మూకుమ్మడిగా దాడికి యత్నించిన ఘటనలపై సంబంధిత ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Post bottom
Post bottom