మున్సిపాలిటీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్

యాదాద్రి భువనగిరి, తొలివెలుగు: మున్సిపాలిటీ ఎన్నికలను సమర్థవంతంగా, శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని జిల్లాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు.
మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన క్షణం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ బూతులలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మాట్లాడుతూ.. పంచాయితీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, మున్సిపల్ ఎన్నికలను కూడా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఎన్నికల విధులకు అవసరమైనంత సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ అక్షాంష్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంత రావు మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్టీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరామ్ రెడ్డి, ఇతర మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
