– గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహణ
– క్రికెట్ పోటీలకు శ్రీకారం చుట్టిన రామ్ భద్ర రావు
వలిగొండ, (తొలివెలుగు): రాబోయే జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రైల్వే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైల్వే ఉద్యోగుల క్రీడా పోటీలు ఆదివారం వలిగొండలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే పిడబ్ల్యూఎవై / సిటీ వై.ఎల్. రామ్ భద్ర రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వలిగొండలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలకు ఆయన టాస్ వేసి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడితో గడిపే రైల్వే ఉద్యోగులకు ఇలాంటి క్రీడా పోటీలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య ఐక్యత, స్నేహభావం పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ క్రీడా పోటీల్లో చిట్యాల నుండి బొమ్మాయిపల్లి వరకు విధులు నిర్వహిస్తున్న రైల్వే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ కాసాని ప్రసాద్, ట్రెజరర్ మామిడి కృష్ణ, రైల్వే ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కర్రె బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో రైల్వే ఉద్యోగులు క్రీడా పోటీలను తిలకించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
