– అక్రమ మద్యం విక్రయాలపై గ్రామస్తుల కఠిన వైఖరి
– యువత భవిష్యత్తు దృష్ట్యా కీలక అడుగు
– గ్రామ ఐక్యతకు నిదర్శనమైన తీర్మానం
– ఉల్లంఘనలకు సహించబోమని హెచ్చరిక

వలిగొండ, తొలివెలుగు :
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామపంచాయతీ పాలకవర్గం, మహిళలు, గ్రామ నాయకులు, ప్రజలు సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ… గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విచ్చలవిడిగా విక్రయమవుతుండటంతో యువత మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం కారణంగా కుటుంబాల్లో కలహాలు, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గ్రామ సమిష్టి నిర్ణయంతో బెల్ట్ షాపుల మూసివేతకు తీర్మానం చేసినట్లు వెల్లడించారు.
తీర్మానం మేరకు ఇకపై గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామంలో శాంతి భద్రతలు, యువత భవిష్యత్తు పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ బొడిగే లింగస్వామి, మాజీ సర్పంచ్ మైసయ్య, ఉపసర్పంచ్ బంగపట్ల జయ, వార్డు సభ్యులు, గ్రామ సెక్రటరీ తండ రేణుకతో పాటు గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
