అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
– పొద్దుటూరు గ్రామంలో విషాద ఘటన
వలిగొండ, తొలివెలుగు : వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొద్దుటూరు గ్రామానికి చెందిన బుంగమట్ల శ్రీనివాస్ (26), శుక్రవారం తన తమ్ముడు శివకుమార్‌తో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. గొర్రెల దగ్గరే ఉండి కాసేపట్లో వస్తానని చెప్పడంతో తమ్ముడు ఇంటికి తిరిగి వచ్చాడు.
అయితే చాలా సమయం గడిచినా శ్రీనివాస్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన శివకుమార్ అతనికి ఫోన్ చేయగా, ఫోన్ రింగ్ అవుతున్నప్పటికీ స్పందన లేకపోయింది. అనుమానం వచ్చిన శివకుమార్ తండ్రి బుంగమట్ల నరసింహతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూడగా, శ్రీనివాస్ నోటి నుంచి నురుగు వస్తూ అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు.
కుటుంబ సభ్యులు వెంటనే శ్రీనివాస్‌ను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, శనివారం చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు.
ఈ ఘటనపై మృతుడి తండ్రి బుంగమట్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ యుగేందర్ గౌడ్ తెలిపారు. మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
