– దేవుడి దర్శనానికి వెళ్లి అనంత లోకాలకు…
– కూతురి పుట్టిన రోజునే తల్లి మృతి
– గ్రామంలో విషాద ఛాయలు
వలిగొండ, (తొలివెలుగు): దేవుడి దర్శనం కోసం వెళ్లిన ఓ వివాహిత ప్రమాదవశాత్తు మృతి చెందిన విషాద ఘటన వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో చోటుచేసుకుంది. కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఆమె, గుండంలో జారిపడి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…
యాదగిరిగుట్ట మండలం, మల్లాపురం గ్రామానికి చెందిన కర్రె లాస్య (27), సంక్రాంతి పండుగ సందర్భంగా తన తల్లి స్వగ్రామమైన పులిగిల్లకు వచ్చింది. ఆదివారం తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా గ్రామంలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆలయం సమీపంలోని గుట్టపై ఉన్న గుండంలో కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు జారి పడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలు లాస్యకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అంతేకాకుండా, ఆమె చనిపోయే ముందు రాముని గుట్టపైకి ఎక్కుతున్న సమయంలో తన తండ్రితో కలిసి తీసుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆ వీడియో చూసిన పలువురు తీవ్రంగా భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ దుర్ఘటన గ్రామ ప్రజలను శోకసంద్రంలో ముంచెత్తింది.
