– పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
– సర్పంచులు బాగా పనిచేస్తేనే గ్రామాలకు పేరు
– శిక్షణా తరగతుల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు

తొలివెలుగు, పోచంపల్లి : గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం పోచంపల్లి మండలం జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్ధ ఇన్స్టిట్యూట్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు గ్రామ పంచాయతీ పాలన, విధులు, అభివృద్ధి అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్వామి రామానంద తీర్ధ రూరల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ కిషోర్ రెడ్డి, డైరెక్టర్ విహారి, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఎంఆర్వో శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే సర్పంచ్లు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచ్లు సమర్థవంతంగా పని చేస్తేనే వారి గ్రామాలకు మంచి పేరు వస్తుందన్నారు. పంచాయతీ రాజ్ చట్టం కింద సర్పంచ్లకు కల్పించిన అధికారాలు, విధులు తదితర అంశాలను శిక్షణలో భాగంగా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ, త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడడం వంటి ప్రధాన అంశాల్లో సర్పంచ్లు చురుకుగా వ్యవహరించాలని తెలిపారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

పంచాయతీ రాజ్ చట్టంలోని గ్రామ పాలన విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, ఆదర్శ గ్రామపంచాయతీల నిర్మాణం వంటి అంశాలపై సర్పంచ్లకు ఈ శిక్షణ ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, మోరల్ స్కిల్స్ వంటి అంశాలపై కూడా సర్పంచ్లు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీఓలు, నూతన సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
