జనసేనకు షాక్: కాంగ్రెస్లో చేరిన మండల అధ్యక్షుడు పర్నే శివారెడ్డి
– చౌటుప్పల్ రాజకీయాల్లో కీలక పరిణామం

చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ మండల రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి చెందిన కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పర్నే శివారెడ్డి, ఆయన సతీమణి రజిత శనివారం తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య శివారెడ్డి దంపతులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలు తమను ఆకర్షించాయని ఈ సందర్భంగా పర్నే శివారెడ్డి తెలిపారు.

శివారెడ్డితో పాటు జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న బంగారు అంజి, బీజేపీకి చెందిన ఎర్ర ఉషయ్య తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో లింగోజిగూడెం గ్రామంతో పాటు మండల కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బి.ఎన్. రెడ్డి, మాజీ జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మునుగోడు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయ దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కీలక నాయకుల చేరికతో మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
