టికెట్ వివాదం – మనస్థాపంతో అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 17వ వార్డులో ఏకగ్రీవ ఎన్నికల నేపథ్యంలో ఒక అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం, అధికార పార్టీ తరఫున టికెట్ పొందిన అభ్యర్థి వస్తం మల్లమ్మ గంగ రాములు తీవ్ర మనస్థాపానికి గురై చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించారు.
స్థానికుల కథనం ప్రకారం, 17వ వార్డులో మరో అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మల్లమ్మ గంగ రాములు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు డబ్బులు తీసుకొని నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రచారం జరగడంతో ఆమె తీవ్రంగా బాధపడినట్లు సమాచారం.
ఆమె ఇంట్లో ఉరేసుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఇంటి తలుపు పగలగొట్టి ఆమెను రక్షించారు. అనంతరం ఆమెను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
