పేరుకే పట్టణాలు… ప్రజాస్వామ్యం ఎక్కడ?
– ఓటు అమ్మితే హక్కులూ అమ్ముకున్నట్లే
తొలివెలుగు/ ప్రత్యేక కథనం :

చౌటుప్పల్ , తొలివెలుగు : పట్టణాలు అంటే అభివృద్ధి, సౌకర్యాలు, క్రమబద్ధమైన పాలన అనే భావన ఉండాలి. కానీ నేటి పట్టణాల వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. అద్దాల్లా మెరిసే భవనాలు, షాపింగ్ కాంప్లెక్సుల మధ్య రోడ్లు మాత్రం ఆటో ఎదురొస్తే బైక్ వెళ్లలేని స్థితిలో ఉన్నాయి. డ్రైనేజీ పనుల పేరిట రోడ్లు ధ్వంసం, రోడ్ల నిర్మాణం పేరిట డ్రైనేజీల పూడ్చివేత—ఇది అభివృద్ధా, అవివేకమా అనే సందేహం ప్రజల్లో పెరుగుతోంది.
కాగితాల్లో 30 అడుగుల రోడ్లు… నేలపై మాత్రం 10 అడుగులే కనిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఒకవైపు పచ్చదనం పేరుతో మొక్కలు నాటి విద్యుత్ తీగలకు అడ్డువస్తున్నాయంటూ విమర్శలు చేస్తూ, మరోవైపు షాపులకు అడ్డుగా ఉన్నాయనే నెపంతో పచ్చని చెట్లను నరికివేయడం పట్టణ పరిపాలనలోని ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తోంది.
వర్షం పడితే మోకాళ్ల లోతు వరద నీరు రోడ్లపై ప్రవహిస్తూ, ఇళ్లలోకే చేరుతోంది. ఆన్లైన్ సేవల పేరుతో సౌలభ్యాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నా, లంచాలు, సిఫారసులు లేకుండా ఏ చిన్న పని కూడా జరగని పరిస్థితి కొనసాగుతూనే ఉంది. రోడ్లపై అడ్డగోలు షాపుల కిరాయిలు, బడ్డీలు, పండ్ల బండ్లతో పార్కింగ్ సమస్య తీవ్రతరమవుతోంది. అదే సమయంలో రోడ్డు పక్కన బైక్ నిలిపితే మాత్రం ట్రాఫిక్ ఫైన్లతో ప్రజలను వేధించడం న్యాయమా అనే ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు?
ఈ సమస్యలకు బాధ్యులు ఎవరు? పరిష్కారం ఎవరు చేయాలి? అని ప్రశ్నిస్తే సమాధానం చివరకు ఓటుకే వచ్చి చేరుతుంది. ఒకసారి ఎన్నికల్లో చేసిన పొరపాటు వల్లే ఐదేళ్ల పాటు ప్రజలు మూగ ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారన్న వాస్తవాన్ని అంగీకరించాల్సిందే.
గ్రామాల్లో నిరక్షరాస్యత, అమాయకత్వం కారణంగా ఓటర్లు ప్రలోభాలకు లోనవుతుంటే, పట్టణాల్లో ప్రపంచ, దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహన ఉన్నవారే అదే ప్రలోభాలకు లొంగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. చదువుకున్న యువత, మేధావులు, చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు, భావి భారత పౌరులను తయారు చేసే అధ్యాపకులు సైతం పట్టణ ఎన్నికల్లో ప్రభావం చూపలేక చేతులెత్తేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం.
లక్షలు, కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు, ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా అక్రమ సంపాదనకే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే వ్యవస్థ మొత్తం భ్రష్టుపడుతోందన్న విమర్శల్లో నిజం లేకపోలేదు. ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకునేందుకు లంచాలు, కమీషన్లు, కబ్జాలు తప్పవన్న భావన పాలకుల్లో పాతుకుపోయింది.
ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయినా మార్పు ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంది. “నా ఒక్క ఓటు అమ్ముకుంటే ఏమౌతుంది” అనే నిర్లక్ష్యమే చివరికి మన హక్కుల్ని మనమే కోల్పోయే పరిస్థితిని తెచ్చిపెడుతోంది. ప్రలోభాలకు ఓటు అమ్మితే, గెలిచినవాడు ప్రజలను లక్షల్లో అమ్ముకుంటున్నాడన్న వాస్తవాన్ని ప్రతి ఓటరు గ్రహించాల్సిన అవసరం ఉంది.
పక్క దేశాల్లో చట్టాలు, పరిపాలన ఎలా అమలవుతున్నాయో చూసినప్పుడు, అన్ని వనరులు ఉన్న మన దేశాన్ని వదిలి మేధావి యువత విదేశాలకు వలస వెళ్లడానికి కారణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వ్యక్తిగత పరాజయం కాదు, వ్యవస్థాగత వైఫల్యం.
నిజాయితీగా, సమర్థులైన అభ్యర్థులకు ఓటు వేయడం మొదటి అడుగు. అంతేకాదు, ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకులను నిలదీసే చైతన్యం ప్రతి పౌరుడిలో ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది పెద్ద మాటలు కాదు – ఒక్క ఓటు, ఆ ఓటుకు ఉన్న విలువను మనం గుర్తించడమే.
