Telugu Updates

‘ పెద్ది ‘ ఇకలేరు

– శోకసంద్రంలో నర్సంపేట: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు

– యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

– తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు

– కేసీఆర్ నమ్మినబంటు.. ఉమ్మడి జిల్లా ఉద్యమ రథసారథి మృతితో విషాదం

తొలివెలుగు, వరంగల్:

Post Midle

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుకు గురై గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 

పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల హనుమకొండలో గుండెపోటుకు గురికావడంతో తొలుత స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించక కన్నుమూశారు.

 

1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీతో అనుబంధం కొనసాగించిన ఆయన జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పార్టీ కన్వీనర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు.

 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహిత అనుచరుడిగా గుర్తింపు పొందారు.

 

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన వ్యక్తిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన భౌతికకాయానికి పార్టీ నాయకులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.

Post bottom
Post bottom