గణేశ్ విగ్రహాల తరలింపులో క్రేన్ దోపిడీ
– చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద వాహనదారులకు తప్పని ఇబ్బందులు
– బ్రిడ్జి కింద విగ్రహాల తరలింపునకు రూ.6 వేల వసూలు చేస్తున్నారని ఆరోపణ
– గ్యాస్ వెల్డింగ్ పేరుతో అదనంగా రూ.2 వేలు తీసుకుంటున్నారని ఆవేదన
– పండుగ సమయాన్ని ఆసరాగా చేసుకుని అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపణ
– అధికారులు స్పందించి వసూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

తొలివెలుగు, చిట్యాల: గణేశ్ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు గణేశ్ విగ్రహాలను తరలిస్తున్న వాహనదారులకు చిట్యాల పట్టణ కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొత్తగూడెంకు చెందిన లింగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి కింద నుంచి భారీ విగ్రహాలను తరలించే సమయంలో ఎదురవుతున్న సమస్యలను ఆసరాగా చేసుకుని కొందరు క్రేన్ యజమానులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

లింగేశ్వర్, కొత్తగూడెం వాసి
లింగేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే బ్రిడ్జి కింద నుంచి గణేశ్ విగ్రహాన్ని తరలించేందుకు క్రేన్ సహాయం తీసుకుంటే ఒక్క విగ్రహానికి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. విగ్రహాన్ని బ్రిడ్జి కింద నుంచి తరలించే క్రమంలో అవసరమయ్యే గ్యాస్ వెల్డింగ్ కోసం మరో రూ.2 వేలు అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు.

గణేశ్ నవరాత్రుల సందర్భంగా విగ్రహాలను తరలించే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇలా అధిక మొత్తాలు వసూలు చేయడం వల్ల నిర్వాహకులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని లింగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే బ్రిడ్జి వద్ద విగ్రహాల తరలింపునకు సంబంధించి ధరలను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

పండుగ సమయాల్లో భక్తులు, నిర్వాహకులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు పరిస్థితిని పరిశీలించి, అధిక వసూళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, క్రేన్ యజమానులపై చేసిన ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
