హస్తినాపురంలో కారుకు నిప్పు.. హోటల్‌లో ఘర్షణే కారణమా?
• బిర్యానీ ఆలస్యంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం
• దాడి జరిగిన అరగంటకే కారుకు నిప్పంటించినట్లు ఫిర్యాదు

తొలివెలుగు, ఎల్బీనగర్: హస్తినాపురం సిగ్నల్ సమీపంలోని గ్రిల్ కాటేజ్ హోటల్ ఎదుట నిలిపి ఉంచిన కారు అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపింది. బిర్యానీ ఆలస్యంగా వడ్డించడంపై హోటల్ సిబ్బందితో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయగా, ఆ తర్వాతే కారుకు నిప్పంటించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన తుమ్మాటి మహేందర్ యాదవ్ (26) తన ఐదుగురు స్నేహితులతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి టీఎస్ 07 కేడీ 3708 నంబరు గల కారులో హస్తినాపురంలోని గ్రిల్ కాటేజ్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి చాలాసేపు ఎదురుచూసినా రాకపోవడంతో హోటల్ యాజమాన్యంతో వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
ఈ క్రమంలో కిందకు వచ్చి మాట్లాడుకుందామని చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటల్ యజమానితో పాటు మరికొందరు తమపై చేతులతో, కర్రలతో దాడి చేశారని మహేందర్ యాదవ్ ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు 100 నంబరుకు వచ్చిన కాల్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణను అదుపులోకి తెచ్చినట్లు తెలిసింది.
అరగంట తర్వాత కారులో మంటలు
ఘర్షణ అనంతరం మహేందర్ స్నేహితులు కారును అక్కడే వదిలి వెళ్లిపోయారు. సుమారు అరగంట తర్వాత తిరిగి వచ్చి కారును తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, తెల్లవారుజామున 4 గంటల సమయంలో కారు మంటల్లో కాలిపోతుండటాన్ని గుర్తించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణ
హోటల్ యాజమాన్యానికి చెందిన సాయిరెడ్డి అనే వ్యక్తి తమ భాగస్వామిపై జరిగిన దాడికి ఆగ్రహించి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు మహేందర్ యాదవ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు దారితీసిన పరిస్థితులు, కారుకు నిప్పంటించిన ఘటనలో ఎవరి పాత్ర ఉందనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
