ఘట్‌కేసర్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని 100 గొర్రెల మృతి
• ఔషాపూర్ సమీపంలో ఘటన.. పట్టాలపైకి దూసుకొచ్చిన గొర్రెలు
• యాదాద్రి జిల్లా జూలూరు వాసి కిష్టయ్యకు చెందినవిగా గుర్తింపు
• ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే అధికారులు, పోలీసులు

తొలివెలుగు, ఘట్‌కేసర్ : మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఔషాపూర్ సమీపంలోని కేపాల్ వద్ద రైల్వే పట్టాలపైకి వచ్చిన గొర్రెలను దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో సుమారు 100 గొర్రెలు మృతి చెందాయి.

మృతిచెందిన గొర్రెలు యాదాద్రి–భువనగిరి జిల్లా జూలూరు గ్రామం అలీనగర్‌కు చెందిన బాలమోని కిష్టయ్యకు చెందినవిగా గుర్తించినట్లు సమాచారం. కాజీపేట నుంచి హైదరాబాద్ నాంపల్లి వైపు వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు సమీపానికి రావడంతో శబ్దానికి భయపడిన గొర్రెలు ఒక్కసారిగా రైల్వే పట్టాలపైకి పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సమీపంలో ఉన్న గొర్రెల కాపరి వాటిని అదుపు చేయలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం.
ఘటనాస్థలికి అధికారులు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన గొర్రెల వివరాలను నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఒక్కసారిగా అధిక సంఖ్యలో గొర్రెలు మృతి చెందడంతో వాటి యజమాని కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో జూలూరు గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.
