Telugu Updates

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

– బాలికల వసతి గృహాల పరిశీలన

– వసతులు, భోజనం, భద్రతపై ఆరా

– విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్

తొలివెలుగు, నల్లగొండ : విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహం, పాత బాలికల వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్టల్‌లోని విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. వసతి, భోజనం, తాగునీరు, పరిశుభ్రత, విద్యా సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనశాల, వంటగది, సామగ్రి నిల్వ గదులు, హాస్టల్ గదులను పరిశీలించి పరిశుభ్రతను మెరుగుపర్చాలని అధికారులకు సూచనలు చేశారు.

Post Midle

విద్యార్థులకు సమయానికి పోషకాహారంతో కూడిన భోజనం అందేలా చూడాలని, తాగునీటి సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్, అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టి వసతులను మెరుగుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

చదువుతో పాటు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. కంప్యూటర్ విద్య, చరిత్ర పుస్తకాలు సహా విద్యార్థులకు కావాల్సిన పుస్తకాల వివరాలు సేకరించి, అన్ని అవసరమైన పుస్తకాలను సంక్షేమ హాస్టళ్లకు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యార్థులు నిర్భయంగా చదువుకునే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి శశికళ, ఏఎస్‌డబ్ల్యూ ఓ వెంకటేశం, హాస్టల్ వార్డెన్ సుమలత, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Post bottom
Post bottom