– మోదీ పాలనలో పారదర్శకత: రూ.45 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి!
– కులవృత్తులకు ‘విశ్వకర్మ’ భరోసా – ఎంపీ లక్ష్మణ్ వివరణ.
– రామ మందిర దర్శనానికి రాహుల్ గాంధీకి భయమెందుకు?
– గ్రామాల్లో పారిశుధ్య విప్లవం.. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి.

చౌటుప్పల్, తొలివెలుగు : కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభివృద్ధి కంటే దోచుకోవడం, దాచుకోవడంపైనే ఎక్కువ మక్కువ ఉందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో శనివారం నిర్వహించిన ‘వికసిత్ భారత్ – ఆజీవిక మిషన్’ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

గత ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాల కారణంగా సంప్రదాయ కులవృత్తులు తీవ్రంగా నష్టపోయాయని, వాటిని పునరుజ్జీవింపజేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘విశ్వకర్మ’ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా 18 రకాల సంప్రదాయ వృత్తుల్లో పని చేస్తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు.

మోదీ పాలనలో పాలనాపరమైన పారదర్శకత గణనీయంగా పెరిగిందని పేర్కొంటూ, ఉజ్వల గ్యాస్, స్వచ్ఛ భారత్, జనధన్ వంటి పథకాల ద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే చేరుతున్నాయని అన్నారు. గత 11 సంవత్సరాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా రూ.45 లక్షల కోట్లకు పైగా నిధులు ప్రజలకు అందాయని వెల్లడించారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య విప్లవం సాధించామని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ, కోట్లాది మంది ఆరాధ్యదైవమైన అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి కూడా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దోనూరు వీరారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, దూడల బిక్షం, చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షుడు కైరం కొండ అశోక్, కొయ్యలగూడెం గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న, గుండ్లబావి సర్పంచ్ నందగిరి వెంకటేష్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, యాస అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
