చౌటుప్పల్ బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు
– భారీగా రియాక్టర్లు ధ్వంసం.. ప్రాణ నష్టం భయం

చౌటుప్పల్ , తొలివెలుగు :
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ పరిధిలో ఉన్న బృందావన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు రియాక్టర్లు పేలినట్లు సమాచారం. పేలుడు తీవ్రతతో భారీ శబ్దాలు వినిపించగా, మంటలు ఎగసిపడుతున్నాయి.
పేలుడు సమయంలో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు భారీ ప్రాణనష్టం వాటిల్లి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం.
చౌటుప్పల్ మండలం మల్కాపురం, ఎల్లగిరి, ధర్మోజిగూడెం, తంగడపల్లి, లింగారెడ్డిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, కాట్రేవు తదితర గ్రామాలతో పాటు భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ మండలాల పరిధిలో పలు బల్క్ డ్రగ్, ఇంటర్మీడియట్ ఔషధ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
గతేడాది జైకేసారం గ్రామంలోని ఎస్ఆర్ ఫార్మా కంపెనీలో కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఘటనతో పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పేలుడు కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు విచారణ ప్రారంభించారు.
