– జ్వరమంటూ కట్టుకథలు.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు
– వెలుగు చూసిన విస్తుపోయే నిజం.. వెంకటాపూర్‌లో కలకలం

ఎల్లారెడ్డిపేట, తొలివెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న ఓ బాలుడు తీవ్ర గాయాల పాలైన ఘటన కలకలం రేపింది.
గ్రామానికి చెందిన కొంపెల్లి లక్ష్మీ–విజయ్ కుమార్ దంపతులు తమ కుమారుడు విద్వాన్ష్‌ను ప్రతిరోజులాగే అంగన్వాడీ కేంద్రంలో వదిలి పనులకు వెళ్లారు. ఈ క్రమంలో బాలుడికి జ్వరం వచ్చిందని, వెంటనే వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని అంగన్వాడీ టీచర్ రాణి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిసింది.
అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్న తల్లిదండ్రులు బాలుడి కంటిపై మరియు చేతులపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాలుడి కన్నుకు తీవ్ర గాయం జరిగినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.
తమ కుమారుడిని అల్లరి చేస్తున్నాడని కొట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని బాలుడి తండ్రి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అంగన్వాడీ టీచర్ రాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై గ్రామంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
