Telugu Updates

అత్తపై అల్లుడి అత్యాచారం.. ఆపై హత్య

– కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో కలకలం

కల్వకుర్తి, తొలివెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాగుడుకు బానిసైన అల్లుడు, ఇల్లరికంగా తీసుకొచ్చిన అత్తపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రఘుపతిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెకు కొన్నేళ్ల క్రితం తిమ్మాజీపేట మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించింది. అల్లుడు మద్యానికి బానిస కావడంతో కుమార్తెను వేధింపులకు గురిచేస్తుండటంతో, కుమార్తెను రక్షించాలనే ఉద్దేశంతో అతడిని ఇల్లరికంగా ఇంట్లో ఉంచుకుంది.

Post Midle

అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడు అత్తపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సోమవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మృతురాలి రెండో కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటన మానవ సంబంధాల విలువలపై సమాజాన్ని ఆలోచింపజేస్తోందని, కుటుంబ బంధాలపై నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Post bottom
Post bottom