దోతిగూడెం వి.జే. సాయి కెమికల్ ల్యాబ్‌లో భారీ పేలుడు
వి.జే. సాయి కెమికల్ ల్యాబ్‌లో భారీ రియాక్టర్ పేలుడు..
దట్టమైన పొగతో కమ్ముకున్న పరిశ్రమ
లంచ్ సమయం కావడంతో తప్పిన పెను ప్రమాదం
రెండు ఫైర్ ఇంజన్లతో మంటల అదుపు..
ఒకరు మృతి చెందినట్లు సమాచారం… మరికొందరికి స్వల్ప గాయాలు

భూదాన్ పోచంపల్లి, తొలివెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని వి.జే. సాయి కెమికల్ ల్యాబ్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ రియాక్టర్ పేలుడు సంభవించి కలకలం రేగింది. పేలుడు ధాటికి యూనిట్ ఆవరణలో నిల్వ ఉంచిన రసాయన డ్రమ్‌లు మంటలు అంటుకోవడంతో భారీగా పొగ కమ్ముకుంది. దట్టమైన నల్లపొగ పరిసర ప్రాంతాలపై వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమించారు. రియాక్టర్ పేలుడుతో కొంతమేర రసాయనాలు లీకై కంపెనీ ఆవరణ బయటకు ప్రవహించినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అధికారులు భద్రతా చర్యలు చేపట్టి సమీప ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, లంచ్ సమయం కావడంతో కార్మికులు ఎక్కువ మంది యూనిట్ వెలుపల ఉండటం వల్ల భారీ ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

పేలుడు శబ్దం సమీప గ్రామాల వరకు వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపమా, రసాయనిక ప్రతిచర్యలో సమస్యలేమైనా ఉన్నాయా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.

ఇటీవలే చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావనం కంపెనీలో కూడా రియాక్టర్ పేలిన విషయం విధితమే. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రసాయన పరిశ్రమల్లో భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
