
తొలివెలుగు, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నిద్రిస్తున్న ఓ వలస కార్మికుడు ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి లిఫ్ట్ గుంతలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సీతారాం (24)గా గుర్తించారు.
తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాం బతుకుదెరువు కోసం ఐదు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి చౌటుప్పల్‌కు వలస వచ్చి మేస్త్రి పనులు చేస్తున్నాడు. తంగడపల్లి రోడ్డులోని సత్యనారాయణ వెంచర్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటిలో తన బంధువు రాజు యాదవ్‌తో కలిసి పని చేస్తున్నాడు.
సోమవారం రాత్రి పని ముగించుకున్న అనంతరం ఇద్దరూ భవనం మూడో అంతస్తుపై నిద్రించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో రాజు యాదవ్ నిద్రలేచి చూడగా సీతారాం కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన అతను చుట్టుపక్కల వెతకగా, గ్రౌండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ కోసం తవ్విన గుంతలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.
స్థానికుల సహాయంతో వెంటనే సీతారాంను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అర్ధరాత్రి సమయంలో టాయిలెట్‌కు వెళ్లే క్రమంలో నిద్ర మత్తులో కాలు జారి మూడో అంతస్తు నుంచి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మృతుడి అన్న రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
