పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత
• 431 కిలోల గంజాయి స్వాధీనం
• రూ.2.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు సీజ్
• ఇద్దరు నిందితుల అరెస్ట్.. మరో ఇద్దరు పరారీ
• నకిలీ నంబర్ ప్లేట్‌తో మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనం స్వాధీనం

తొలివెలుగు, చౌటుప్పల్: తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (ఆర్ఎన్పీఎస్) బృందం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంతంగి టోల్‌ప్లాజా వద్ద చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో నకిలీ నంబర్ ప్లేట్‌తో సంచరిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు.
(TS 07 GM 4617) నంబర్ గల వాహనాన్ని తనిఖీ చేసే సమయంలో అందులో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయగా సుమారు 431 కిలోల గంజాయి లభ్యమైంది. ఇందులో 5 కిలోల చొప్పున 83 ప్యాకెట్లు, 2 కిలోల చొప్పున 8 ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2 కోట్ల 18 లక్షల 75 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల రవాణాకు ఉపయోగించిన మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనాన్ని కూడా సీజ్ చేశారు.
పోలీసుల విచారణలో నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని తేలింది. రాజమండ్రి ప్రాంతంలో రాకేష్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని సేకరించి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు వారు వెల్లడించినట్లు సమాచారం.

అదుపులోకి తీసుకున్న నిందితులను సలీమ్ (34), అమన్ (22)గా గుర్తించారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా లిషాడి గ్రామానికి చెందిన వారని, డ్రైవింగ్ వృత్తిగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో అమీరుద్దీన్, ఫిరోజ్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
చౌటుప్పల్ పోలీసుల సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథ కుమార్ తెలిపారు.
