Telugu Updates

కేసీఆర్‌పై రాజకీయ కుట్ర.. రేవంత్ సర్కార్‌పై కూసుకుంట్ల ఫైర్!

– చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ భారీ రాస్తారోకో.. స్తంభించిన జాతీయ రహదారి

చౌటుప్పల్, తొలివెలుగు : ఫోన్ ట్యాపింగ్ నెపంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ (SIT) విచారణను అస్త్రంగా వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రహదారి పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి.

Post Midle

ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి రాజకీయ కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

రాజకీయ లబ్ధి కోసమే సిట్ విచారణను కొనసాగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. వెంటనే సిట్ విచారణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Post bottom
Post bottom