భువనగిరిలో వీధి కుక్కల భీభత్సం.. నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు
> మున్సిపాలిటీ నిద్ర వీడేదెప్పుడు? బాధితుల ఆగ్రహం
> భువనగిరిలో ఘోరం.. కనుగుడ్డు బయటకు వచ్చేలా కరిచిన శ్వానాలు
> మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై బాధితుల ఆందోళన.. జాతీయ రహదారిపై ధర్నా

తొలివెలుగు, భువనగిరి : భువనగిరి జిల్లా కేంద్రంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
వివరాల్లోకి వెళితే… భువనగిరి పట్టణంలోని తారకరామా నగర్లో నివాసముంటున్న సందెల ప్రియాంష్ (4) సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటుండగా ఓ వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి ముఖంపై తీవ్ర గాయాలు కాగా, కనుగుడ్డు బయటపడేంతగా దారుణంగా గాయపడ్డాడు.

గాయపడిన చిన్నారిని వెంటనే భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ పట్టణంలోని జాతీయ రహదారిపై బైఠాయించారు. బాలుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడంతో కొంతసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

పట్టణంలో వీధి కుక్కల బెడద పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
