- మద్యం వ్యాపారుల వినతి తిరస్కరణ..
- చండూరులో రూ. 30 కోట్ల పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు/చండూరు, (తొలివెలుగు) : మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపుల సమయపాలన విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన మద్యం వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఈ విషయం తేల్చిచెప్పారు. మీ వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యాలను పాడు చేయొద్దని హెచ్చరించిన ఆయన, ఉదయం నుంచే మద్యం సేవించే అలవాటుకు స్వస్తి పలికేలా వ్యాపారులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. మద్యం నియంత్రణపై తాను తీసుకున్న నిర్ణయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే వైన్ షాపులు తెరవాలని, సాయంత్రం ఆరు గంటల తర్వాతే పర్మిట్ రూములకు అనుమతి ఉంటుందని తెలిపారు. అవసరమైతే నియోజకవర్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను మరింత పెంచుతామని చెప్పారు. ఉదయం పని చేసి సాయంత్రం మాత్రమే మద్యం సేవించే విధానాన్ని ప్రజల్లో తీసుకురావడమే లక్ష్యమన్నారు. మద్యం విచ్చలవిడిగా లభ్యం కావడం వల్ల పనులు మానేసి నిరంతరం తాగుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోందని, యువత మద్యానికి బానిసై దారి తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆలోచనలు మద్యం నుంచి వ్యక్తిగత అభివృద్ధి వైపు మళ్లించడానికే ఈ చర్యలన్నారు. ఈ నిర్ణయానికి ఇతర నియోజకవర్గాల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని తెలిపారు.

చండూరు మున్సిపాలిటీలో రూ.30 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
చండూరు మున్సిపాలిటీలో రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన మెయిన్ రోడ్డు (సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు)తో పాటు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాటి ప్రభుత్వం పదవిలో ఉండి పోరాడితే అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, ఒక్క రాజీనామాతోనే ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకు వచ్చిందన్నారు. తన రాజీనామా ఫలితంగానే చండూరులో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని వ్యాఖ్యానించారు.

2018లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లినప్పటి నుంచి మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని చెప్పారు. మునుగోడు ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఈ రోడ్డు చండూరు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందన్నారు. చండూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని, ఇంకా మూడు సంవత్సరాల కాలం ఉందని, చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందన్నారు. హైదరాబాద్ తరహాలో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని తెలిపారు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి మునుగోడుకు నిధులు తీసుకురావాలని కోరినట్లు వెల్లడించారు. తనకు పదవి మీద వ్యామోహం లేదని, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే అహర్నిశలు శ్రమిస్తానని స్పష్టం చేశారు. మిగిలిన మూడు సంవత్సరాల్లో ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.
