Telugu Updates

నార్కట్‌పల్లి చౌరస్తాలో లారీ బీభత్సం

> మెడికల్ షాపులోకి దూసుకెళ్లిన లారీ 

> నార్కట్‌పల్లి – నల్లగొండ క్రాస్ రోడ్డులో ప్రమాదం

> దుకాణం ధ్వంసం.. పలువురికి గాయాలు

> ప్రాణభయంతో పరుగులు తీసిన జనం

> విచారణ చేపట్టిన పోలీసులు

Post Midle

నార్కట్‌పల్లి, తొలివెలుగు :- నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని నల్లగొండ క్రాస్ రోడ్డులో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ రహదారి పక్కన ఉన్న దీపక్ మెడికల్ షాప్‌లోకి దూసుకెళ్లింది.

ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, వేగంగా వస్తున్న లారీ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఉన్న దుకాణాల వైపు మళ్లింది. ఈ క్రమంలో నల్లగొండ చౌరస్తాలో ఉన్న మెడికల్ షాప్‌ను ఢీకొట్టి లోపలికి చొచ్చుకుపోయింది. ప్రమాద సమయంలో షాప్‌లో కొంతమంది ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా లారీ దూసుకెళ్లడంతో అక్కడున్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.

ఘటన వెంటనే స్థానికులు అప్రమత్తమై గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ప్రమాదంతో నల్లగొండ క్రాస్ రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు, అధిక వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Post bottom
Post bottom