Telugu Updates

గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం..

•బిడ్డ అని చెప్పి 9 నెలలు చికిత్స… చివరికి కడుపులో గడ్డగా తేల్చిన ప్రైవేట్ వైద్యులు

తొలివెలుగు, గుడివాడ :- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. కడుపులో గడ్డను బిడ్డగా భావించి తొమ్మిది నెలల పాటు వైద్యం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకున్న తర్వాత అసలు విషయం బయటపడడంతో బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 స్థానికంగా నివసించే ఓ మహిళ గర్భం వచ్చినట్లు భావించి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించింది. వైద్యులు ఆమెకు గర్భం దాల్చిందని చెప్పి నెలల తరబడి మందులు ఇచ్చి చికిత్స అందించారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీగా నమోదు చేసి టీకాలు కూడా వేయించారు.

Post Midle

 

అయితే నెలలు గడుస్తున్నా కడుపులో బిడ్డ కదలికలు లేవని మహిళ పలుమార్లు వైద్యులకు చెప్పినా వారు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళ ప్రశ్నిస్తే వైద్యులు చిరాకు పడుతూ మందలించారని వారు తెలిపారు. ఇటీవల అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించగా కడుపులో బిడ్డ లేదని, గడ్డ పెరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు స్కానింగ్ రిపోర్ట్‌ను తీసుకుని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోవడం బాధాకరమని అంటున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Post bottom
Post bottom