– అవకాశమిస్తే విజయం సాధిస్తా: చెవగోని కవిత వెంకటేష్ గౌడ్
చౌటుప్పల్, (తొలివెలుగు): చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు బీసీ మహిళా రిజర్వేషన్ కావడంతో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని చెవగోని కవిత వెంకటేష్ గౌడ్ తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆశీర్వదించి అవకాశం ఇస్తే, వార్డు ప్రజల మద్దతుతో ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మున్సిపాలిటీల్లోనూ, గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీల అభివృద్ధినే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఆమె వివరించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేయడం, దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతగా పేర్కొన్నారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కానీ, పేదలకు ఇళ్లు కానీ మంజూరు చేయలేదని విమర్శించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషితో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీ వార్డులు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, 13వ వార్డు నుండి పోటీ చేసే అవకాశం తనకు కల్పించాలని పార్టీ అధిష్ఠానాన్ని చెవగోని కవిత వెంకటేష్ గౌడ్ కోరారు.
