మనవడా.. నీకోసం నా ప్రాణమిస్తా!
• బోరుబావిలో చిన్నారి.. కాపాడేందుకు దూకిన తాత
• ఊట్లపల్లిలో కంటతడి పెట్టిస్తున్న వెంకన్న త్యాగం
• క్షేమంగా బాలుడు.. విగతజీవిగా తాతయ్య

తొలివెలుగు, మిర్యాలగూడ రూరల్: ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన తన నాలుగేళ్ల మనవడిని ప్రాణాలకు తెగించి కాపాడుకున్న ఓ తాత.. అదే ప్రయత్నంలో తన ప్రాణాలను అర్పించాడు. ఈ హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకన్న అనే వృద్ధుడి నాలుగేళ్ల మనవడు శనివారం ఉదయం ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న బోరు గుంతలో జారిపోయాడు.
దీనిని గమనించిన తాత వెంకన్న క్షణం కూడా ఆలోచించలేదు. మనవడిని రక్షించాలనే తపనతో వెంటనే ఆ బోరు గుంతలోకి దిగాడు. అయితే గుంత లోతుగా ఉండటం, ఇద్దరూ అందులో ఇరుక్కుపోవడంతో గాలి ఆడక ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే మిర్యాలగూడ రూరల్ పోలీసులకు, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు.
ఉత్కంఠగా సాగిన రెస్క్యూ ఆపరేషన్:
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గంటల తరబడి శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చివరకు నాలుగేళ్ల బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. కానీ, అప్పటికే గుంతలో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను బయటకు తీసి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మనవడి ప్రాణాలు నిలిపి తాత మృత్యువాత పడటంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సకాలంలో స్పందించి బాలుడిని రక్షించిన పోలీసులను గ్రామస్తులు అభినందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
